Grandmas stories presents you telugu stories
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు
ఒక ఊరిలో రఘుపతి, కులపతి అనేవారు ఉండేవారు. రఘుపతి బాగా డబ్బున్నవాడు, డబ్బు కోసం గడ్డి తినేవాడు. కులపతికి అంతగా డబ్బు లేకపోయినా తనకున్న దాంతో సంతృప్తిగా ఉంటూ, ఎవరికైనా తనకు చేతనైనంత సాయం చేస్తూ ఉండేవాడు.అందువలన కులపతికి ఊరిలో మంచి పేరుంది. రఘుపతికి ఇది కంటగింపుగా ఉండేది.
చదువుకుని అక్షర జ్ఞానం ఉండటం వలన రఘుపతి చేసే మోసం కులపతికి బాగా తెలుసు. అందువలన కులపతి ఎంత అవసరం వచ్చినా ఎప్పుడు రఘుపతిని మాత్రం అడగలేదు.
కులపతికి ఒకసారి డబ్బు బాగా అవసరం అయ్యింది. ఊరిలో ఎవరి దగ్గర అంత సొమ్ము లేకపోవటంతో గత్యంతరంలేక కులపతి డబ్బు కోసం రఘుపతి దగ్గరకు వెళ్ళాడు.
"ఆహా! చిక్కాడు చేతిలో కులపతి!!" అనుకుంటూ రఘుపతి ఆనందపడ్డాడు.
బాగా ఆలోచించి "సరే కులపతి! నీ అవసరం చూసి మనసు కరిగి ఇస్తున్నా. కానీ ఒక షరతు! నీవు గడువులోపల తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే నీ శరీరం నుంచి 1 కేజి మాంసం తీసుకుంటాను!!" అని అన్నాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో రఘుపతి షరతుకి అంగీకరించి డబ్బు తీసుకుంటాడు కులపతి.
కానీ కులపతి అనుకున్న గడువులోపు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేకపోతాడు.
ఇదే సదవకాశం అనుకుని రఘుపతి ఈ విషయాన్ని ఊరి పంచాయితీలో పెద్దల దగ్గరికి తీసుకువెడతాడు.
రఘుపతి గురించి బాగా తెలిసిన ఊరి పెద్దలు విషయం అర్థం చేసుకుని కులపతిని పిలిచి " నీవు రఘుపతి డబ్బు తిరిగి చెల్లించలేకపోతే నీ శరీరం నుంచి 1కేజీ మాంసం రఘుపతి కోసి తీసుకోవటానికి ఒప్పుకున్నావా!!" అని అడుగుతారు.
కులపతి " అవును" అని సమాధానమిస్తాడు.
అప్పుడు ఊరి పెద్దలు ఒక నిర్ణయానికొచ్చి, "సరే! రఘుపతి నీవు న్యాయబద్దంగా నీకు రావాల్సిన 1 కేజీ మాంసం కులపతి శరీరం నుంచి తీసుకో, కానీ ఒక్క బొట్టు నెత్తురు కూడా రాకూడదు. ఎందుకంటే షరతు ప్రకారం 1 కేజీ మాంసం మాత్రమే తీసుకోవాలి గనుక. అలాకాకుండా 1 కేజీ మాంసంతోపాటు ఒక్క బొట్టు రక్తం వచ్చినా 1 కెజికన్నా ఎక్కవ మాంసం కోసినా నీకు మరణ శిక్ష వేస్తాము." అని అంటారు. రఘుపతి తాను తీసుకున్న గోతిలో తానే పడేలాగా!!!!
రఘుపతికి ఉరి పెద్దల సమయస్ఫూర్తితో ఇచ్చిన తీర్పు అర్థమయ్యింది. తన డబ్బు తనకి తిరిగి రాకపోగా పరువు కూడా పోయింది. ఇంక చేసేదేముంది "తను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు!!!!" అనుకుంటూ తిరిగి మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు.
అందుకే అన్నారు పెద్దలు," ఎవరు తీసిన గోతిలో వారే పడతారు" అని.
అంటే ఎవరైనా ఎవరికైనా అపకారం తలపెట్టాలనుకుంటే అది వారికే జరిగినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
ఈ సామెత కథ మీ అందరూ చదివి సందర్భానుసారం ఉపయోగించండి అప్పుడే తెలుగు భాష వర్ధిల్లుతుంది.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
No comments:
Post a Comment